సియోల్: ప్రపంచ దేశాల ఆందోళనలను, హెచ్చరికలను ఉత్తరకొరియా ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తున్నది. తాజాగా నాలుగు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. అణుసామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఉత్తర హాంగ్యాంగ్ ప్రావిన్స్‌లోని కిమ్చైక్ సిటీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ పరీక్షలను నిర్వహించినట్లు ప్రభుత్వ అధికారిక మీడియా కేసీఎన్ఏ (KCNA) వెల్లడించింది. కొరియన్ తూర్పు తీరంలోని సముద్ర జలాల్లో నాలుగు ‘హసల్-2’ క్షిపణులను పరీక్షించిందని తెలిపింది. శత్రుదేశాలకు వ్యతిరేకంగా అణు ప్రతిదాడిని నిర్వహించగల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఈ డ్రిల్‌ను నిర్వహించిందని పేర్కొన్నది. ఈ క్రూయిజ్ క్షిపణులు 2000 కిలోమీట్ల దూరంలో ఉన్న నిర్ధేశిత లక్షాలను 10,224 సెకన్లలో చేధించాయని తెలిపింది.
కాగా, నాలుగు రోజుల క్రితం రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతకుముందు శనివారం (ఫిబ్రవరి 18న) ఖండాతర క్షిపణిని పరీక్షించింది. ఇది దాదాపు 66 నిమిషాలపాటు గాల్లో ప్రయాణించి జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పడింది. దీంతో ఆదివారం అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధవిన్యాసాలు నిర్వమించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న ఉత్తరకొరియా గుర్తుతెలియని క్షిపణిని తూర్పు సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. అది జపాన్ సముద్రంలో పడిందని వెల్లడించారు.