ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా ఇటీవల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన విషయం తెలిసిందే. తమ వద్ద ఇంకా అనేక క్షిపణులు ఉన్నట్లు కూడా ఆ దేశ నేత కిమ్(Kim Jong Un) గతంలో తెలిపారు. అయితే కొరియా యుద్ధం 70వ వార్సికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగుకు.. ఉత్తర కొరియా నేత కిమ్ తమ వద్ద ఉన్న ఆయుధాలను చూపించారు. ప్యోంగ్యాంగ్లో జరిగిన ఆయుధ ప్రదర్శనలో రష్యా రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాసాంగ్ ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్‌ను సెర్గీకి కిమ్ చూపించారు. రష్యాతో పాటు చైనాకు చెందిన రక్షణశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏప్రిల్‌లో ఐసీబీఎంను ఉత్తర కొరియా సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. ఘన ఇంధనం ద్వారా తొలిసారి ఆ క్షిపణిని పరీక్షించారు. ఆయుధ ప్రదర్శనలో కొత్తగా తయారు చేసినట్లు రెండు డ్రోన్ డిజైన్లను కూడా ప్రజెంట్ చేశారు. అమెరికా దాడుల సమయంలో ఆ దేశం వాడే డ్రోన్ల తరహాలో ఆ కొత్త డ్రోన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకోవడం గమనార్హం.