సియోల్: ఉత్తర కొరియా(North Korea) ఇవాళ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈశాన్య తీరం వైపు ఆ పరీక్ష నిర్వహించినట్లు చెప్పింది. బుధవారం ఉదయం ఈ పరీక్ష జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఆ ప్రయోగానికి చెందిన ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఉత్తర కొరియా చెత్త బెలూన్లను బోర్డర్ వద్ద జార విడుస్తున్నట్లు ఇటీవల దక్షిణ కొరియా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన రెండు రోజులకే ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది.
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిగిన నేపథ్యంలో జపాన్ కూడా ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. అయితే ఆ అలర్ట్‌ను ఎత్తి వేస్తున్నామని, ఎందుకంటే ఆ క్షిపణి జపాన్ తీరానికి రావడం లేదని జపాన్ పీఎంవో మరో ట్వీట్లో వెల్లడించింది.