వాషింగ్టన్, ఆగస్టు 16 : ప్రపంచంలోని రెండు శక్తివంతమైన దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలు ఊరించి.. ఊరించి ఉసూరుమనిపించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి అలస్కా శిఖరాగ్ర సమావేశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణపై ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూసినప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందాయి. సమావేశం అనంతరం ట్రంప్, పుతిన్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ అన్నారు. ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించి మూడు గంటల పాటు జరిగిన శిఖరాగ్ర సమావేశం తర్వాత తుది ఒప్పందం కుదరలేదని ఆయన అన్నారు. ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ‘మేము అంగీకరించిన అంశాలు చాలా ఉన్నాయి. మనం ఇక్కడకు చేరుకోలేకపోయిన రెండు పెద్ద విషయాలను నేను చెబుతాను. కానీ ఈ చర్చల ద్వారా మేం కొంత ముందుకు సాగాము. అయితే అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసేంత వరకు ఎటువంటి ఒప్పందం కుదరనట్టే’ అని అగ్ర దేశాధినేత స్పష్టం చేశారు.
‘రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం నేరుగా శాంతి ఒప్పందానికి వెళ్లడమేనని అందరూ నిర్ణయించారు. ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందం మాత్రమే కాదు. తరచుగా నిలబడని కాల్పుల విరమణ ఒప్పందం కూడా కాదు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. కాగా, ట్రంప్ ప్రకటనను మాస్కో స్వాగతిస్తున్నదని రష్యా పేర్కొంది. తాము యుద్ధ విరామాన్ని కాదు, పూర్తి పరిష్కారం కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తాను ఇంకా మాట్లాడలేదని, త్వరలోనే యూరోపియన్ నేతలతో కలిసి ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నట్టు ట్రంప్ చెప్పారు. చర్చలకు ముందు పరిస్థితి కన్నా ఇప్పుడు చాలా పురోగతిలో ఉన్నామని తాను భావిస్తున్నానన్నారు. ‘మేము చర్చలు జరిపాం. డీల్ పూర్తి కావడంపై నిర్ణయం పూర్తిగా జెలెన్స్కీపై ఆధారపడి ఉంది. ఒప్పందం చేసుకోవాలని నేను జెలెన్స్కీకి సూచిస్తా. కానీ ఆయన దానికి నిరాకరించే అవకాశం ఉంది. నేను యూరోపియన్ దేశాలకు కూడా చెబుతాను. వారు కూడా ఇందులో కొంచెం జోక్యం చేసుకోవాలి. రష్యా చాలా శక్తివంతమైన దేశం. రష్యా-ఉక్రెయన్ మధ్య చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. తమ మధ్య జరిగిన సమావేశానికి పదికి పది రేటింగ్ ఇస్తున్నానన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ 2022లో కనుక ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగి ఉండేది కాదని అన్నారు. మాస్కో, వాషింగ్టన్ మధ్యలో చాలా కష్టతరమైన కాలం తర్వాత నేడు చాలా మంచి ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరుచుకున్నాయని ఆయన అన్నారు. ‘మన దేశాలు ఉమ్మడి శత్రువులతో ఎలా పోరాడుతున్నాయో మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. ఈ వారసత్వం భవిష్యత్తులో మాకు సహాయపడుతుందని’ ఆయన అన్నారు. ఈ చర్చల ద్వారా తాను, ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒక అవగాహనకు చేరుకున్నామన్నారు. శైశవ దశలో ఉన్న పురోగతిని దెబ్బతీయవద్దని ఆయన యూరప్‌ను ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణను విషాదంగా అభివర్ణించిన ఆయన.. ఆదే సమయంలో రష్యా యుద్ధం చేయడానికి గల ‘ప్రాథమిక కారణాలను’ పరిష్కరించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
ఉక్రెయిన్‌లో యుద్ధవాతావరణం త్వరగా సద్దుమణగాలని యావత్తు ప్రపంచం కోరుకుంటున్నదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. శాంతిస్థాపన కోసం ఇరువురి నాయకత్వం ప్రశంసనీయమని తెలిపింది.