వాషింగ్టన్: అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నవేళ, వైరస్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా పరిశోధకులు ‘ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్’ను అభివృద్ధి చేశారు. నిరంతరం తన స్వరూపాన్ని మార్చుకుంటున్న సార్స్-కోవ్-2, హెచ్5ఎన్1 వైరస్‌లను సమర్థంగా అడ్డుకోగలిగే, సరికొత్త వ్యాక్సిన్‌ను పరిశోధకులు తయారుచేసినట్టు తెలిసింది. పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు చేయగా, సార్స్-కోవ్-2లో అనేక రకాల జాతులకు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక వ్యవస్థను కొత్త వ్యాక్సిన్ ప్రేరేపించింది. అంతేగాక, సాంప్రదాయ వ్యాక్సిన్ల కన్నా 40 రెట్లు తక్కువ మోతాదు కొత్త వ్యాక్సిన్‌కు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో టీకా ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.వ్యాక్సిన్‌ను అప్డేట్ చేయడానికి కొంత సమయం పడుతున్నదని పరిశోధకుడు సురేశ్ కూచిపూడి అన్నారు.
కెనడాలో కఠినమైన సరిహద్దు చట్టం ; భారతీయ విద్యార్థులపై ప్రభావం
ఒట్టోవా: తమ దేశంలో ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకునే వలసదారులకు కెనడా షాక్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ ‘స్ట్రాంగ్ బోర్డర్ యాక్ట్’ బిల్లును కెనడా సిద్ధం చేసింది. దీని ప్రభావం కెనడాలోని భారతీయ విద్యార్థులపై ఉంటుందని సమాచారం. ప్రతిపాదిత బిల్లు ప్రకారం, 2020 జూన్ 24 తర్వాత కెనడాకు వచ్చి.. ఏడాది అనంతరం ఆశ్రయం కోరుతూ వచ్చే దరఖాస్తులను ‘ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ బోర్డ్’కు పంపరాదని కెనడా నిర్ణయించింది. విద్యార్థులకు, తాత్కాలిక నివాసహోదా కలిగినవాళ్లకు ఇది వర్తిస్తుందని ప్రతిపాదిత బిల్లు పేర్కొన్నది. గత ఏడాది 20,245 మంది అంతర్జాతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులు అందాయి. ఇందులో అత్యధికం ఇండియా, నైజీరియా దేశాల విద్యార్థులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.