లాస్ ఏంజిల్స్: కింగ్ ఆఫ్ పాప్, మూన్ వాకర్ మైఖేల్ జాక్సన్ 2009 జూన్‌లో అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. దిస్ ఈజ్ ఇట్ టూర్ కోసం ప్రిపేరవుతున్న ఆ పాప్ స్టార్ అనూహ్య రీతిలో తన ఇంట్లో హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు. ఆ కేసులో ఫిజీషియన్ కాన్రాడ్ ముర్రేను అరెస్టు చేసినా.. మైఖేల్ జాక్సన్ గురించి మరికొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. 50 ఏళ్ల జాక్సన్ తన మృతికి ముందే చాన్నాళ్ల నుంచి డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుస్తోంది. ఎంజేపై రూపుదిద్దుకున్న కొత్త డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని బయటపెట్టారు. టీఎంజెడ్ ఇన్వెస్టిగేట్స్.. ఊ రియల్లీ కిల్డ్ మైఖేల్ జాక్సన్ పేరుతో ఆ డాక్యుమెంటరీని వచ్చే నెలలో ఫాక్స్ ఛానల్లో ప్రసారం చేయనున్నారు. వాస్తవానికి ఫిజీషియన్ కాన్రాడ్ నుంచి ప్రొపోఫాల్ డ్రగ్స్‌ను మైఖల్ జాక్సన్ వాడినా ఆ సింగర్ ఎన్నో ఏళ్ల నుంచి డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. దాని కోసం 19 రకాల ఫేక్ ఐడీలను కూడా మైఖేల్ జాక్సన్ క్రియేట్ చేసినట్లు కొత్త డాక్యుమెంటరీలో చూపించారు. వేర్వేరు డాక్టర్ల వద్దకు వెళ్లే జాక్సన్ డ్రగ్స్ కోసం రకరకాల ఐడీలు వాడినట్లు అనుమానిస్తున్నారు.