Parkinson | జెరూసలెం: లక్షణాలు వృద్ధి కాకముందే పార్కిన్సన్స్ వ్యాధిని గుర్తించే రక్త పరీక్షను ఇజ్రాయెల్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం నేచర్ ఏజింగ్ జర్నల్లో శుక్రవారం ప్రచురితమైంది. నాడీ సంబంధిత సమస్యల్లో కీలక పాత్ర పోషించే ఆర్ఎన్ఏ భాగాల (టీఆర్ఎఫ్) బదిలీపై పరిశోధకులు దృష్టి సారించి రెండు కీలకమైన జీవాణువులను గుర్తించారు.
వీటిలో ఒకటి పార్కిన్సన్స్తో, మరొకటి ఆ వ్యాధి పురోగతితో సంబంధం కలిగి ఉన్నాయి. టీఆర్ఎఫ్పై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు పార్కిన్సన్స్ వ్యాధి తొలి దశలో వచ్చే మార్పులను గమనించారు. ఈ రక్త పరీక్ష చాలా వరకు వేగంగా, కచ్చితమైన అంచనాతో, చౌక ధరలో వ్యాధి నిర్ధారణ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. పీసీఆర్ సాంకేతికతను ఉపయోగించి ఈ రక్త పరీక్షను నిర్వహిస్తారు.