అంకారా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎఫ్-35 యుద్ధ విమానాల(F-35 Jets)ను టర్కీకి అమ్మనున్నట్లు వెల్లడించారు. అయితే టర్కీపై ఉన్న ఆంక్షలను ముందుగా ఎత్తివేసేందుకు ప్రయత్నించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఎఫ్-35 విమానాలను అమ్మేందుకు లైన్ క్లియర్ చేయనున్నారు. టర్కీ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ను టర్కీ కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2019లో రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను టర్కీ కొనుగోలుచేసింది. దీంతో టర్కీపై అమెరికా ఆంక్షలు పెట్టింది.అయితే ఆ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఎఫ్-35 అమ్మకాలకు చెందిన తుది నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు ట్రంప్ చెప్పారు.
టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలను అమ్మరాదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ అన్నారు. ఆ అమ్మకాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పశ్చిమాసియాలో అధికార సమతుల్యత దెబ్బతింటుందని నెతన్యహూ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌తోనూ వ్యక్తిగతంగా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు చెప్పారు. టర్కీని మిత్రదేశంగా అమెరికా భావించరాదు అన్నారు. ముస్లిం బ్రదర్వుడ్తో టర్కీకి లింకు ఉన్నదని, హమాస్‌కు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్ మద్దతు ఇస్తున్నారని, రికార్డు స్థాయిలో జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని నెతన్యహూ పేర్కొన్నారు. అమెరికాకు తగిన మిత్రదేశం టర్కీ కాదు అని నెతన్యహూ ఆరోపించారు.