కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు.. ఇజ్రాయెల్‌లో హంగ్ పార్లమెంట్
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను సాధించలేకపోయింది. దీంతో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
- నెతన్యాహుకు దక్కని మెజారిటీ
- ప్రతిపక్షానికీ తప్పని సవాలు
- ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ
జెరూసలేం, అక్టోబర్ 30 : ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను సాధించలేకపోయింది. దీంతో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెసెట్)లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 స్థానాలు అవసరం. నెతన్యాహు కూటమికి 53 స్థానాలు రాగా, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి. అరబ్ పార్టీలకు కలిపి 19 స్థానాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో అవి కీలకంగా మారాయి. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలతో పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే కూటమికి మెజారిటీకి మరో 8 స్థానాలు అవసరం. ప్రతిపక్షానికి మరో 13 స్థానాలు కావాలి. ఈ నేపథ్యంలో అరబ్ పార్టీల మద్దతు ఎవరి లభిస్తుందన్నది తదుపరి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే అంశంగా మారింది.
అరబ్ పార్టీల మద్దతు ఎవరికి?
నెతన్యాహును అధికారానికి దూరం చేయాలనుకుంటున్న ప్రతిపక్షానికి అరబ్ పార్టీల మద్దతు కీలకం కానుంది. అయితే, వాటితో కలిసి పనిచేయడంపై ప్రతిపక్ష పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా, లేక నెతన్యాహు వ్యతిరేక పార్టీలన్నీ కలసి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రతిపక్ష నేత ఐసెన్‌కోట్ అరబ్ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. షరతులతో కూడిన సహకారానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. మరోవైపు, అరబ్ పార్టీల నేతలు నెతన్యాహు వ్యతిరేక కూటమికి పార్లమెంట్ స్పీకర్ ఎంపికలో మద్దతిచ్చే అంశంపైనా చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా, పార్లమెంట్ చర్చలు, చట్టాల రూపకల్పనపై ప్రభావం చూపే అవకాశం వాటికి ఉంది.
నెతన్యాహుకు రాజకీయ, న్యాయపరమైన సవాళ్లు
ఒకవేళ నెతన్యాహు అధికారం కోల్పేతే, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల కేసులు మరోసారి కీలకంగా మారవచ్చు. అంతేగాకుండా, 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిని ముందుగా గుర్తించడంలో, అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ విఫలమైందన్న అంశంపై సమగ్ర విచారణకు డిమాండ్లు పెరిగే అవకాశం ఉన్నది. ఇదిలాఉండగా, అరబ్ పార్టీల మద్దతుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారంటూ నెతన్యాహు పార్టీ లికుడ్ ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ సహకారం కూడా ఉందని పేర్కొన్నది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి నిర్ధారిత ఆధారాలు బయటపడలేదు. అరబ్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రశ్నార్థకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షం విమర్శించింది.
మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం?
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కఠినంగా మారనున్నాయి. పార్టీలు అవసరమైన మద్దతును కూడగట్టలేకపోతే వచ్చే ఏడాది ప్రారంభంలో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నెతన్యాహు అధికారంలో కొనసాగుతారా? ప్రతిపక్షం అరబ్ పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అన్నది రానున్న చర్చలపై ఆధారపడి ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

