ఖాట్మండు: నేపాల్ నూతన అధ్యక్షుడిగా రేపు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌ను ఎన్నుకున్నారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, గత గురువారం జరిగిన నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 313 మంది ఫెడరల్ పార్లమెంట్ సభ్యులు, 518 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 214 మంది పార్లమెంట్ సభ్యులు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు రామ్‌చంద్ర పౌడెల్‌కు మద్దతుగా ఓటువేశారు. దాంతో పౌడెల్ గెలిచినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. విపక్ష CPN-UML కూటమి అభ్యర్థి నెంబాంగ్పై ఆయన విజయం సాధించారు.