కాఠ్మాండు: నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్ ప్రచండ(Pushpa Kamal Dahal Prachanda).. ఇవాళ పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఆయన బలపరీక్షలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నా.. ప్రచండ మాత్రం తన బలనిరూపణ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 క్లాజ్ 2 ప్రకారం 69 ఏళ్ల ప్రధాని విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. కూటమి సర్కారు నుంచి జనతా సమాజ్‌బాదీ పార్టీ వైదొలగడంతో ప్రచండ విశ్వాస పరీక్షకు నిలిచారు. హోంమంత్రి రాబి లబిచానేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. కోఆపరేటివ్ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించాయి. ఒకవేళ కూటమి సర్కారులో చీలికలు వస్తే, అప్పుడు ప్రధాని 30 రోజుల తేడాలోనే విశ్వాస పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రచండ బలపరీక్షలో పాల్గొనడం ఇది నాలుగవసారి. 275 మంది ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 138 ఓట్లు అనుకూలంగా పోల్ కావాల్సి ఉంటుంది. అయితే ఇవాళ జరిగిన బలపరీక్షలో ఆయనకు 157 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఓటింగ్‌ను బహిష్కరించింది.