థానే: నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులందరూ చనిపోయినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన భారతీయ ఫ్యామిలీ కథ విషాదాంతమైంది. అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవి నిజానికి ఎప్పుడో విడిపోయారు. దూరంగా ఉంటున్న ఆ జంట మళ్లీ ఒక్కటి కావాలనుకున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి అశోక్ ఫ్యామిలీ నేపాల్ టూర్కు వెళ్లింది. కానీ విమాన ప్రమాద రూపంలో ఆ ఫ్యామిలీ శాశ్వతంగా అందరికీ దూరం అయ్యింది. అశోక్ త్రిపాఠీ ఒడిశాలో కంపెనీ నడిపారు. ఇక వైభవి భండేకర్ త్రిపాఠి ముంబైలోని బీకేసీ వద్ద ఓ కంపెనీలో పనిచేసింది. ఆ ఇద్దరూ కోర్టు ఆదేశాల ప్రకారం కొన్నాళ్ల క్రితం విడిపోయారు.
వైభవికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ధనుష్(22), కుమార్తె(15) రితికతో కలిసి థానే సిటీలోని బాల్కమ్ ప్రాంతంలో ఉన్న రుస్తుమ్జీ ఏథెనా అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తోంది. వైభవి తల్లి 80 ఏళ్ల బామ్మ ఇంట్లోనే ఉంటోంది.కానీ విమాన ప్రమాద ఘటన గురించి ఆమెకు ఏమీ తెలియదు. పొఖారా సిటీ నుంచి టేకాఫ్ తీసుకున్న తారా ఎయిర్లైన్స్ విమానంలో అశోక్, వైభవి జంట ఉంది. ముస్తాంగ్ జిల్లాలో ఉన్న కొండల్లో ఆ విమానం కూలింది. ఆ ప్రమాదంలో ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలతో పాటు ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.