న్యూఢిల్లీ: నేపాల్‌లో గల్లంతైన తారా ఎయిర్‌లైన్స్‌కు (Tara Air aircraft) చెందిన విమానం ఆచూకీ లభించింది. ముస్తాంగ్‌లోని సన్సోవార్ సమీపంలో విమానాన్ని సహాయక బృందాలు గుర్తించినట్లు నేపాల్ ఆర్మీ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జరనర్ నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు. విమాన శకాల సమీపంలో కొన్ని మృతదేహాలను గుర్తించామన్నారు. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. విమానం కుప్పకూలిన ప్రదేశానికి చెందిన ఫొటోలను ఆర్మీ విడుదల చేసింది.
తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9ఎన్-ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. ఉదయం 9.55 గంటలకు పొఖారా నుంచి టేకాఫ్ అయిన విమానం.. నిమిషాల వ్యవధిలోనే కనిపించకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. వారిలో భారత్‌కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఉన్నారు. వీరు ముంబైకి చెందినవారిగా గుర్తించారు.
కాగా, గల్లంతైన విమానాన్ని గుర్తించడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ఆదివారం సాయంత్రం వరకు గాలింపు నిర్వహించారు. అయితే విమానం కూలిందని భావించిన ప్రదేశంలో మంచు కురవడంతో.. గాలింపు నిలిపివేశారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.