Nehal Modi | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. భారత్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నేహల్ మోదీని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా న్యాయశాఖ ప్రకారం.. బెల్జియన్ జాతీయుడైన నేహల్ మోదీని జులై 4న అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ప్రకారం.. పీఎంఎల్ఏ సెక్షన్ 3 కింద మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను చేసినట్లు నేహల్‌పై ఈ రెండు ఆరోపణలు ఉన్నాయి. మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoU)లను ఉపయోగించి పీఎన్బీకి సుమారు రూ.13,500 కోట్ల రుణాలను మోసం చేసిన నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీ, నేహల్‌తో పాటు పలువురిని సీబీఐ, ఈడీ భారత్‌కు అప్పగించాలని కోరుతున్నాయి. నీరవ్ మోదీని అప్పగించేందుకు యూకే కోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపింది. నీరవ్ మోదీ అప్పీళ్లు దాఖలు చేస్తూ వస్తుండడంతో భారత్‌కు తరలించే ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
ప్రస్తుతం లండన్ జైలులో ఉన్న నీరవ్‌ను 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ అభ్యర్థన మేరకు మెహుల్ చోక్సీని ఆంట్వెర్ప్లో అరెస్టు చేసినట్లు బెల్జియం ప్రభుత్వం తెలిపింది. చోక్సీ 2018లో భారతదేశం నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఆంటిగ్వా-బార్బుడాలో పౌరసత్వం తీసుకొని నివసిస్తున్నారు. నీరవ్ మోదీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీలాండరింగ్ చేయడంలో నేహల్ కీలక పాత్ర పోషించనట్లుగా ఈడీ, సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. నేరపూరితంగా ఆర్జించిన ఆదాయాన్ని దాచేందుకు, బదిలీ చేసేందుకు సహకరించినట్లుగా గుర్తించారు. నేహల్ మోదీ అప్పగింతపై విచారణ ఈ నెల 17న జరుగనున్నది. అయితే, ఈ సమయంలో నేహల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. అయితే బెయిల్‌ను వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.