న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ శక్తి ఇండియాను అడ్డుకోలేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ స్పందించారు. ఇండియాను మెచ్చుకున్న ఇమ్రాన్ వైఖరిని మరియం ఖండించారు. ఇండియా ఆత్మాభిమానాన్ని మెచ్చుకుంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని మరియం అన్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఉపాధ్యక్షురాలైన ఆమె మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ పాకిస్థాన్‌ను వదిలేసి, ఇండియాకు వెళ్లాలన్నారు.
ఇండియా అంతగా నచ్చితే ఆ దేశానికి వెళ్లాలంటూ ఇమ్రాన్‌పై ఆమె విమర్శలు చేశారు. అధికారం పోయిన తర్వాత ఇమ్రాన్ క్రేజీగా మారారని, ఆయన్ను తన స్వంత పార్టీ నేతలు బహిష్కరిస్తున్నారని మరియం ఆరోపించారు. ఒకవేళ ఇండియా అంతగా నచ్చితే అక్కడికి వెళ్లు అంటూ, పాకిస్థాన్‌ను వెంటనే వదిలేయాలన్నారు. భారతీయుల్ని ఖుద్దార్ ఖామ్ అంటూ ఇమ్రాన్ కీర్తించారు. అంటే ఆత్మాభిమానం కలవారని ఇమ్రాన్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ఉదయం 10 గంటలకు ఓటింగ్ జరగనున్నది.