టెహ్రాన్ : ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా ఇరాన్ అణ్వాయు స్ధావరాలపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఇరాన్ ఆగడాలను ఆపాలన్న ఉద్దేశంతో ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. అయితే ఇరాన్లో ఉన్న పలు అణు కేంద్రాలపై దాడి చేశారు. దాంట్లో నటాంజ్ అణు శుద్దీకరణ కేంద్రం(Natanz Nuclear Site)పై కూడా ఇజ్రాయిల్ అటాక్ చేసింది. ఆ కేంద్రంపై పలుమార్లు తీవ్రంగా దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. నటాంజ్‌లో అణు శుద్దీకరణ జరుగుతున్నది. ఇక్కడ అండర్‌గ్రౌండ్‌లో న్యూక్లియర్ సైట్ ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇరాన్‌లోని ఫోర్డోలో కూడా మరో అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ సైట్ ఉంది. నటాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో నల్లటి పొగ వస్తున్న విజువల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేరకు డ్యామేజ్ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు.
ఇరాన్‌పై జరిగిన దాడుల్లో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్ కేంద్రంగా కూడా బాంబుల వర్షం కురిసింది. కేవలం ఇరాన్ అణ్వాయుధ ప్రోగ్రామ్ లక్ష్యంగా ఇజ్రాయిల్ మిలిటరీ దాడులకు దిగింది. ఇరాన్ వద్ద 15 అణు బాంబులకు కావాల్సినంత శుద్ది చేసిన యురేనియం ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నది. అయితే ప్రపంచ దేశాలను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇరాన్ త్వరితగతిన అణ్వాయుధాలను రూపొందిస్తున్నదని, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తున్నదని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇరాన్‌పై దాడి చేయడం తప్ప మరో అవకాశం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తున్నది. అణ్వాయు సమీకరణపై దృష్టి పెట్టిన ఇరాన్.. సంపూర్ణ దశకు చేరువైనట్లు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది.
నజాంట్ అణు కేంద్రంపై దాడి తర్వాత అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. రేడియేషన్ లెవల్స్ పెరగలేదని స్పష్టం చేసింది. దాడుల సమయంలో బుషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను టార్గెట్ చేయలేదని కూడా అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.