న్యూయార్క్: హబుల్ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రి నక్షత్ర కూటమి(Triple-Star System) ఉద్భవించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది. సుమారు 550 కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది. హెచ్‌పీ టావూ నక్షత్ర కుటుంబంలో హెచ్‌పీ టావూ, హెచ్‌పీ టావూ జీ2, హెచ్‌పీ టావూ జీ3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మూడింటిలో మిళమిళలాడుతున్న హెచ్‌పీ టావూ చాలా చిన్న వయసున్న నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు 10 మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సూర్యుడి సుమారు 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయం తెలిసిందే.
టీ టౌరీ స్టార్‌లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని, అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హెచ్‌పీ టావూకు చెందిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాసా తాజాగా షేర్ చేసింది. త్రి నక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు, డస్ట్ ఉన్నది. ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెలుతురును ఇవ్వదని, కానీ భారీ ఆకాశ అద్ధంలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసా చేసిన ఇన్‌స్టా పోస్టుకు యూజర్ల తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు.