న్యూయార్క్, డిసెంబర్ 14: భూమి వేడెక్కుతున్నది.. ఆ వేడికి మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి.. నీళ్లలా మారి సముద్రాల్లోకి పరుగులు పెడుతున్నాయి.. మరి, పరిస్థితులకు అనుగుణంగా ఆ నీళ్లు ఎలా మారుతున్నాయి? అని తెలుసుకొనేందుకు నాసా సిద్ధమైంది. ‘భూ ఉపరితల నీరు, సముద్రాల వ్యవస్థ (స్వాట్)’ పేరుతో అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ సహాయంతో రాడార్ శాటిలైట్‌ను పంపనున్నది. గురువారం ఈ ప్రయోగానికి వాండర్బర్గ్ యూఎస్ స్పేస్ ఫోర్స్ బేస్‌ను రెడీ చేశారు.
ఈ ప్రయోగం ద్వారా భూమిపై ఉన్న సముద్రాలు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరుల గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలుసుకొనేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ శాటిలైట్‌లో ఉండే కేఏ-బ్యాండ్ మైక్రోవేవ్ స్పెక్ట్రమ్ ద్వారా వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా నీటి వనరులపై సర్వే చేపట్టవచ్చు. వాతావరణ సమాచారం, సముద్రాలలోని నీటి కదలిక, వేడి సరఫరా, కాలానుగుణ మార్పులను గుర్తించవచ్చు. భూమిపై ఉన్న 90 శాతం వేడిని సముద్రాలే గ్రహిస్తున్నాయి. మరి ఆ వేడి మానవ జీవితంపై ఎలా ప్రభావం చూపుతున్నది? అన్న వివరాలను స్వాట్ ద్వారా పరిశోధకులు తెలుసుకోనున్నారు.