కంటికి కనిపించనంత దూరం.. 3.5 ఏండ్ల ప్రయాణం.. మనిషి ఇప్పటివరకు చేరుకోలేని ప్రాంతం.. అయితేనేం, అక్కడ అపార సంపద కొలువైయున్నది. ఆ సంపద విలువ లక్షలు కాదు.. కోట్లు కాదు.. కోట్ల కోట్లు కాదు.. రూ.74 లక్షల కోట్ల కోట్లకు పైనే. అంటే.. 74 తర్వాత 19 సున్నాలు ఉంటాయన్న మాట. అంకెల్లో చెప్పాలంటే..రూ.74,00,00,00,00,00,00,00,00,000. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఓ గ్రహశకలం విలువ ఇది. దాని పేరు ‘సైక్’. ఈ ఆస్టరాయిడ్‌లో అత్యంత విలువైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయని నాసా వెల్లడించింది. అసలు దీని కథేంటో తెలుసుకోవడానికి 2022లో మిషన్‌ను ప్రారంభించబోతున్నది.
124 మైళ్ల వెడల్పున్న సైక్ గురించి అధ్యయనం చేసేందుకు 2026 నాటికి వ్యోమగామ నౌకను ఈ ఆస్టరాయిడ్ మీదకు చేర్చనున్నది. ఆ గ్రహశకలం పుట్టుపూర్వోత్వరాలు ఏంటి? ఏదైనా పురాతన గ్రహం నుంచి విడిపోయిందా? వంటి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం వెతకనున్నది. దీనిలో భాగంగానే ముందుగా ఆస్టరాయిడ్ ఉపరితల ఉష్ణోగ్రతను కాలిఫోర్నియాలోని కాల్టెక్ నిర్ధారించింది. ఉష్ణోగ్రతను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు చీలిలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్(ఆల్మా) టెలిస్కోప్‌తో పరిశీలించగా ఆస్టరాయిడ్ ఉపరితలంపైనే ౩౦ శాతం ఖనిజాలు ఉన్నట్టు తెలిసింది.
ఈ గ్రహశకలాన్ని ఎప్పుడు గుర్తించారంటే..
అత్యధిక భాగం ఇనుము, నికెల్‌ను కలిగిన సైక్ ఆస్టరాయిడ్‌ను 1852లో గుర్తించారు. సౌర వ్యవస్థ ఏర్పడే సమయంలో గ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టి ఉంటాయని, కక్ష్యలోకి చేరే సమయంలో జరిగిన సంఘర్షణలో ఏదైనా గ్రహం నుంచి విడిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నాసా సైక్ మిషన్ టైమ్‌లైన్
మిషన్ లాంచ్ చేసే సంవత్సరం- 2022
లక్ష్యం దిశగా ప్రయాణ సమయం – 3.5 ఏండ్లు
సైక్‌ను చేరుకొనే సంవత్సరం – 2026
సైక్ పరిశీలన గడువు – 21 నెలల పాటు
2022- ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి సైక్ వ్యోమగామ నౌకను పంపిస్తారు.
2023 – అంగారక గ్రహం పైనుంచి వ్యోమగామ నౌక ప్రయాణిస్తుంది
2026 – సైక్ కక్ష్యలోకి చేరుకుంటుంది