సింగపూర్, డిసెంబర్ 15: సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు అద్భుతాన్ని సృష్టించారు. క్షణాల్లోనే బొద్దింకలను సైబోర్గ్లుగా(యంత్ర పరికరాల సాయంతో శారీరక సామర్థ్యం పెంచుకున్న జీవులు) మార్చగలిగే ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. పోర్టబుల్ స్టిమ్యులేషన్, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన ఈ యంత్రాన్ని కేవలం 68 సెకన్ల వ్యవధిలోనే బొద్దింకకు అమర్చి సైబోర్గ్గా మార్చవచ్చని వెల్లడించారు.
చిన్న ఎలక్ట్రానిక్ బ్యాక్‌ప్యాక్ కిట్ లాంటి ఈ యంత్రాన్ని అమర్చడం ద్వారా బొద్దింకల ప్రవర్తనను, గమన దిశను ప్రభావితం చేయవచ్చని, యాంటెన్నాలను స్టిమ్యులేట్ చేయడం ద్వారా వాటిని ఎటు కావాలంటే అటు వెళ్లేలా చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బొద్దింకలకు ఎలాంటి హాని జరగదని తెలిపారు. ఈ ప్రక్రియతో సైబోర్గ్ బొద్దింకల సైన్యాలను సృష్టించవచ్చని, రిమోట్ కంట్రోల్ సాయంతో నియంత్రించగలిగే ఈ సైబోర్గ్ బొద్దింకలను సెర్చ్, రెస్క్యూ లాంటి ప్రత్యేక కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవచ్చని వివరించారు.