తైవాన్ చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. పెలోసీ పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రాగన్.. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపడుతున్నది. ఒక వేళ తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిమాణాలు తప్పవని, ప్రపంచం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనా, తైవాన్ మధ్య వివాదానికి.. రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి మధ్య సారూప్యత ఉన్నది. రష్యా సరిహద్దున చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ తరహాలోనే చైనాకు కూడా తైవాన్ ఉంది. ఒకప్పుడు సోవియెట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగంకాగా తైవాన్ కూడా గతంలో చైనాలో అంతర్భాగంగానే ఉండేది. 1949లో చెలరేగిన అంతర్యుద్ధంతో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. అయితే ఈ చీలికను డ్రాగన్ గుర్తించడం లేదు. తైవాన్ మాత్రం తమది సర్వసత్తాక, స్వతంత్ర దేశమని ప్రకటించుకుంటున్నది. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం క్రమంగా ముదిరిపోసాగింది. స్వాతంత్య్రాన్ని ఎక్కువగా ఇష్టపడే త్సాయ్ ఇంగ్వెన్ 2016లో తైవాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదం మరింత తీవ్రమైంది. తమ దేశంలో తైవాన్ విలీనం కావాల్సిందేనంటూ చైనా తరుచూ యుద్ధ విమానాల విన్యాసాలు, సైన్యం మోహరింపుతో బెదిరింపులకు దిగుతున్నది. చైనా ఆగడాలను కట్టడి చేస్తూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేస్తున్నది.
ఉద్రిక్తత తారాస్థాయికి ఇలా..
ఉక్రెయిన్ అంశంలో అంతర్జాతీయ సమాజం రష్యా చర్యలను వ్యతిరేకించినప్పటికీ, చైనా మాత్రం పుతిన్ సేనలకు మద్దతు ప్రకటించింది. దీని వెనుక కారణం లేకపోలేదు. ఉక్రెయిన్-రష్యా అంశం సరిగ్గా తమకు-తైవాన్‌కు మధ్య వివాదంతో సరిపోలడం డ్రాగన్‌కు తెలియనిదేంకాదు. అందుకే ప్రపంచ దేశాలు రష్యాను దూరంపెట్టినప్పటికీ, డ్రాగన్ సమర్థించింది. ఇప్పుడు తైవాన్ విషయంలో చైనా కోరుకున్నట్లుగానే రష్యా డ్రాగన్‌కు మద్దతు ప్రకటించింది. మరోవైపు, అమెరికా తైవాన్ పక్షాన నిలబడింది. ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైపీలో పర్యటించారు. తైవాన్‌లో అడుగుపెడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, పెలోసీ దూకుడుగా వ్యవహరించడం డ్రాగన్‌కు మింగుడుపడటం లేదు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను మోడల్‌గా తీసుకొని దాడులకు పాల్పడుతామని చైనా హెచ్చరికలు జారీచేస్తున్నది. ఈ క్రమంలోనే 21 యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది కూడా.
యుద్ధం వస్తే పరిస్థితేమిటి?
తైవాన్‌పై చైనా సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కంటే దీని ప్రభావం చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. తైవాన్‌పై డ్రాగన్ సేనలు వైమానిక దాడులకు దిగితే ప్రపంచంలో మూడొంతుల జలరవాణాకు వేదికగా ఉన్న ఇండో-పసిఫిక్‌లోని నౌకా మార్గాలపై ప్రభావం పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ వాటా 30 శాతం. దీంట్లో దాదాపు 90 శాతం అత్యాధునిక సెమీకండక్టర్లు ఈ దేశంలోనే తయారవుతున్నాయి. యుద్ధం వస్తే చిప్‌ల కొరత ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు.
యుద్ధం వల్ల భారత్‌పై ప్రభావమెంత?
తైవాన్‌తో భారత్‌కు దౌత్య సంబంధాలు లేనప్పటికీ, ఈ వివాదంలో భారత్.. తైవాన్‌కు మద్దతు ప్రకటిస్తే.. ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరే ప్రమాదమున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తైవాన్‌కు మద్దతుగా ఉన్నఅమెరికా.. యుద్ధం ముంచుకొచ్చే సమయానికి వెనుకడుగు వేయొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
తైవాన్ను వీడిన పెలోసీ
ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేసిన పెలోసీ తైవాన్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మంగళవారం రాత్రి ఆ దేశ రాజధాని తైపీలో అడుగుపెట్టిన ఆమె.. బుధవారం ఉదయం తైవాన్ అధ్యక్షురాలు యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తైవాన్ను ఒంటరిగా వదిలివేయబోమని పునరుద్ఘాటించారు. అనంతరం మధ్యాహ్నం దక్షిణకొరియా బయల్దేరారు.