Hezbollah | బీరుట్, అక్టోబర్ 29: లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా మంగళవారం నయీమ్ ఖాసీం నియమితులయ్యారు. ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ దళాలు గత నెలలో హతమార్చిన సంగతి తెలిసిందే. నస్రల్లాకు చాలాకాలంగా డిప్యూటీగా వ్యవహరిస్తున్న 71 ఏండ్ల ఖాసీం ఆయన మృతి తర్వాత తాత్కాలిక నేతగా వ్యవహరిస్తున్నారు. హెజ్బొల్లాలో నిర్ణయాధికారం ఉన్న షురా కౌన్సిల్ ఖాసీంను కొత్త సెక్రటరీ జనరల్‌గా ప్రకటించింది. నస్రల్లా విధానాలను అనుసరిస్తూ, విజయం సాధించే వరకు శ్రమిస్తానని ఖాసీం ప్రతిజ్ఞ చేశారు.
ఉత్తర గాజాస్ట్రిప్‌లో ఐదంతస్తుల భవనంపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 90 మందికిపైగా పౌరులు మరణించారు. ఈ భవనంలో నిరాశ్రయులు తల దాచుకుంటున్నట్టు గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, పాలస్తీనా శరణార్థులకు సహాయం చేస్తున్న యూఎన్ఆర్డబ్ల్యూపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది.