డల్లాస్: అమెరికాలో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కుమారుడి ఎదుటే అతడిని దుండగుడు తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కింద పడిన తలను కాలితో తన్ని అనంతరం చెత్తబుట్టలో పడేశాడు. డాలస్‌లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వాషింగ్ మెషీన్ వాడొద్దన్నందుకు నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు తరుముతుండగా, బాధితుడు పరిగెత్తుతూ భయంతో కేకలు వేసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. డాలస్ సిటీ సామ్యూల్ బౌలేవార్డ్‌లో డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్ ఉంది. అందులో కర్ణాటక మూలాలున్న చంద్ర నాగమల్లయ్య (50) మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం నిందితుడు కోబోస్ మార్టినెజ్ (37), మరో ఉద్యోగిని గదిని శుభ్రం చేస్తుండగా, అక్కడికి వచ్చిన నాగమల్లయ్య అక్కడి పాడైపోయిన మెషీన్‌ను వాడొద్దని వారికి చెప్పాడు.
అయితే అతను నేరుగా మార్టినెజ్‌తో మాట్లాడకుండా తాను ఏం చెప్పానో మార్టినెజ్‌కు అనువాదం చేసి చెప్పాలని ఆ మహిళను కోరాడు. దీంతో ఆగ్రహం చెందిన మార్టినెజ్ కత్తి పట్టుకుని నాగమల్లయ్యను వెంటాడి హత్య చేశాడు. అదే మోటెల్‌లోని ఫ్రంట్ ఆఫీస్ వద్ద పనిచేస్తున్న నాగమల్లయ్య భార్య, కుమారుడు బయటకు వచ్చి అతడిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు వారిని పక్కకు తోసేశాడు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అయితే ఇది ప్రీ ప్లాన్డ్ హత్యా, లేక జాత్యహంకార హత్యా అన్న విషయం నిర్ధారించ లేమని అధికారులు చెప్పారు. నాగమల్లయ్య హత్యపై హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. నిందితుడిని డాలస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మార్టినెజ్ క్యూబా దేశస్థుడని అతనికి నేర చరిత్ర ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.