బెర్లిన్, ఆగస్టు 20: ఎంపాక్స్ కొత్త కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్‌వో యూరప్ ప్రాంతీయ సంచాలకులు హన్స్ క్లుగె మంగళవారం తెలిపారు. ఎంపాక్స్‌ను ఎదుర్కోవడం, నిర్మూలించడంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాధిని ప్రపంచం ఎలా ఎదుర్కొంటుందనేది భవిష్యత్తులో ప్రజారోగ్య రక్షణకు కీలక పరీక్ష లాంటిదని హెచ్చరించారు.
ప్రపంచదేశాలను కలవరపరుస్తున్న మంకీపాక్స్ (ఎంపాక్స్) వ్యాధికి టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మంగళవారం వెల్లడించారు. ఏడాదిలోగా దీనిపై సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఇటీవల కాలంలో ఈ వ్యాధి ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలోవిజృంభిస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో దీనిని ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.