జెనీవా, నవంబర్ 15: నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ, నవజాత శిశువుకు తల్లి స్పర్శ బతికే అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. నెలలు నిండని పిల్లలను పుట్టిన వెంటనే ఇంక్యుబేటర్లలో, ఇంటెన్సివ్ కేర్లలో ఉంచాలని గతంలో చేసిన సూచనను డబ్ల్యూహెచ్వో వెనక్కి తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వద్ద ఉండటం భావోద్వేగంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ కీలకం. ఆ బిడ్డ బతకడానికి వారి స్పర్శ దోహదం చేస్తుంది’ అని డబ్ల్యూహెచ్వో మెడికల్ ఆఫీసర్ కెరెన్ ఎడ్మాండ్ తెలిపారు. బిడ్డ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వీలైనంత త్వరగా తల్లి చెంతకు చేర్చాలని వెల్లడించారు. తల్లీబిడ్డను ఒకే చోట ఉంచేలా ఐసీయూలను తీర్చి దిద్దాలని దవాఖానల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు.