జమైకా: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హరికేన్.. కరీబియన్ దీవుల దిశగా పయనిస్తున్నది. హరికేన్ మెలిసా(Hurricane Melissa) ప్రళయ బీభత్సం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జమైకాలో ఇప్పటికే ఆ హరికేన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జమైకా ద్వీపంలో మరింతగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నది. మంగళవారం తెల్లవారుజామున హరికేన్ మెలిసా తీరాన్ని తాకనున్నది. ఇప్పటికే ఆ పవర్ఫుల్ స్టార్మ్ వల్ల ముగ్గురు మరణించారు. హైతీతో పాటు డోమెనికన్ రిపబ్లిక్లో కూడా మరణాలు సంభవించాయి.
గంటకు సుమారు 282 కిలోమీటర్ల వేగంత ఈదురుగాలులు వీస్తున్నాయి. మెలిసా హరికేన్‌ను అయిదో కేటగిరీ తుఫాన్‌గా ప్రకటించారు. తీరాన్ని తాకే సమయంలో ఆ హరికేన్ మరింత శక్తివంతంగా మారనున్నది. అయితే నెమ్మదిగా ముందుకు కదులుతున్న ఆ హరికేన్ వల్ల అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలో చోటుచేసుకునే అవకాశం ఉన్నది.