న్యూయార్క్, మార్చి 30: ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాను కొనసాగిస్తున్నది అమెరికా. తాజాగా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా మిత్రదేశం ఇజ్రాయెల్‌కు అమెరికా రెండు వేలకు పైగా బాంబులు, ఫైటర్ జెట్లను సరఫరా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు వార్షిక సైనిక సహాయంగా మరో 3.8 బిలియన్ డాలర్లను కూడా అమెరికా అందించిందని తెలుస్తున్నది. అయితే, ఈ వార్తలపై అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ స్పందించ లేదు. కాగా, ఇజ్రాయెల్‌కు సైనిక సహకారాన్ని నిలిపివేయాలని అధికార డెమాక్రటిక్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను కోరుతున్నప్పటికీ సైనిక సహకారం కొనసాగుతుండటం గమనార్హం.