న్యూఢిల్లీ : తూర్పు అఫ్గానిస్థాన్‌లో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,800 మందికిపైగా గాయపడినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.47 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైనట్టు జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అఫ్గానిస్థాన్‌తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తర భారతదేశం, పాకిస్థాన్‌లోనూ భూ ప్రకంపనలు కనిపించాయి.
భారీ భూకంపం తర్వాత 4.7, 4.3, 5.0, 5.0తో సంభవించిన వరుస ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. కునార్ ప్రావిన్సులో మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అఫ్గాన్ ఆరోగ్యశాఖ మంత్రి షరాఫత్ జమాన్ తెలిపారు. సాయం కోసం ఏ దేశమూ ముందుకు రాలేదని అఫ్గాన్ విదేశాంగ శాఖ ఆవేదన వ్యక్తంచేసింది. చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ సదస్సులో పాల్గొని ఇండియాకు బయలుదేరిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఫ్గాన్ భూకంపంపై విచారం వ్యక్తంచేశారు. బాధితులకు అవసరమైన మానవతా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, అక్టోబర్ 7, 2023లో 6.3 తీవ్రతతో అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో 4 వేల మంది మరణించారు.