న్యూఢిల్లీ : జనరేషన్ జెడ్(జెన్‌జీ) నిరసనలు మెక్సికోకూ పాకాయి. దేశంలోని హింస, అవినీతితో విసిగిపోయిన వేలాది మంది యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. శనివారం మెక్సికోలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘మాకు మరింత భద్రత కావాలి’ అని ఈ సందర్భంగా అండ్రెస్ మస్సా(29) అనే బిజినెస్ కన్సల్టెంట్ మీడియాతో అన్నారు. దేశంలో ప్రజాదరణ పొందిన ఉరుయాపన్ మేయర్ కార్లొస్ మాంజో ఇటీవల హత్యకు గురి కావడంపై యువతరం ఆందోళన వ్యక్తం చేసింది.
మెక్సికో సిటీలో జరిగిన ర్యాలీలో కొందరు నిరసనకారులు మాట్లాడుతూ నేరాలు, హింసను అదుపు చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘కార్లొస్ చనిపోలేదు, ప్రభుత్వమే ఆయనను చంపింది’ అని వారు నినదించారు. ఈ హత్యను నిరసిస్తూ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ నివసించే నేషనల్ ప్యాలెస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని నిలువరించారు. నిరసనకారుల వెనక అతివాద రాజకీయ పార్టీలు ఉన్నాయని క్లాడియా ఆరోపించారు.