టెహ్రాన్, జూలై 11: తమ సుప్రీం నేత, తన తండ్రి అయతొల్లా ఖమేనీని హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక రాతపూర్వక సందేశాన్ని విడుదల చేస్తూ ఇరాన్ ప్రజల ఈ డిమాండ్‌ను తప్పక నెరవేర్చవలసిందేనని పేర్కొన్నారు. కాగా, గత నెలలో అమెరికాతో జరిగిన 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని కనుక అగ్రరాజ్యం ఉల్లంఘించి దాడులు చేసినా.. పూర్తి స్థాయి రక్షణ కోసం సన్నద్ధంగా ఉన్నామని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. అమెరికాపై టెహ్రాన్‌కు అస్సలు నమ్మకం లేదని, చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌కు అదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిపారు. హొర్ముజ్ జలసంధి పూర్వ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, శనివారం టెహ్రాన్‌లో వినిపించిన భారీ పేలుడు శబ్దం పాత ప్రమాదకరమైన మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేసే ప్రక్రియ వల్ల ఏర్పడిందని ఇరాన్ అధికారులు ప్రకటించారు.
యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశ అణు మౌలిక సదుపాయాలను పునరుద్ధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు తాజా ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో దెబ్బతిన్న ‘పర్చీన్’ కాంప్లెక్స్‌లో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలంటూ ఇరాన్ ఆందోళనకారులు పిలుపునివ్వడంతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ‘ఇరాన్ లక్ష్యంగా 1,000 క్షిపణులను సిద్ధంగా ఉంచాం. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం తమ బెదిరింపులను అమలు చేయాలని చూస్తే, తదుపరి క్షణాల్లోనే వేల క్షిపణులు దూసుకుపోతాయి’ అంటూ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తన హత్యకు కుట్రల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు.