Mini Brain | న్యూయార్క్, జూలై 5: వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూలకణాలను 3డీ మ్యాపింగ్‌తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్‌ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు. దీన్ని ‘కీమెరాయిడ్’గా పిలుస్తున్నారు. మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో.. ఈ కీమెరాయిడ్ కూడా అలాగే పనిచేస్తుందని పరిశోధకులు అన్నారు. అయితే, భిన్నమైన వ్యక్తుల నుంచి మూలకణాలను తీసుకోవడంతో ఈ మినీ బ్రెయిన్ ఆయా వ్యక్తుల మెదడులా కాకుండా కొత్తగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. మెదడుపై డ్రగ్స్ పనితీరు తెలుసుకోవడానికి దీన్ని వినియోగిస్తామన్నారు.
గాలి, సూర్యరశ్మితో తాగునీరు ఉత్పత్తి
న్యూయార్క్, జూలై 5: తాగునీటి సంక్షోభం మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. గాలి, సూర్యరశ్మి నుంచి క్యాన్డ్ డ్రింకింగ్ వాటర్‌ను తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ‘స్కై వాటర్’గా పిలిచే ఈ నీటి తయారీకి సూర్యకాంతితో పనిచేసే హైడ్రోప్యానెల్స్ను వినియోగించనున్నట్టు వెల్లడించింది. ఒక్కో ప్యానెల్ రోజుకు మూడు లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేస్తుందని వివరించింది. త్వరలోనే ఈ నీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపింది.