Tidal Kites | లండన్, నవంబర్ 15: నీటి అలలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వేలాశక్తి (టైడల్ ఎనర్జీ) రంగంలో సరికొత్త ఆవిష్కరణ చోటు చేసుకున్నది. నీటిలో ఈదుతూ విద్యుత్తును ఉత్పత్తి చేసే ‘టైడల్ కైట్’ను స్వీడన్‌కు చెందిన మినెస్టో అనే సంస్థ తయారుచేసింది.
టర్బైన్‌తో ఉండే ఈ టైడల్ కైట్ పేరు ‘డ్రాగన్ 12’. గాలిపటం ఆకాశంలో ఏవిధంగా ఎగురుతుందో, ఇది సముద్రంలో అదే విధంగా ఈదుతుంది. అందుకే దీనిని టైడల్ కైట్ అని పిలుస్తున్నారు. ఇది ఈదుతున్నప్పుడు నీటిలో ఎనిమిది సంఖ్య ఆకారాన్ని సృష్టిస్తుంది.
దీంతో అలల ప్రవాహంలో శక్తి పెరిగి, వేలాశక్తిని ఉత్పత్తి చేసే టర్బైన్ సామర్థ్యం మెరుగవుతుంది. పవన విద్యుత్తుకు సమానంగా వేలాశక్తి ఉత్పత్తి అయ్యేలా టైడల్ కైట్స్ ఉపయోగపడతాయని మినెస్టో సంస్థ చెప్తున్నది. తక్కువ ఖర్చుతో వీటిని సముద్రంలోకి పంపించవచ్చని, నిర్వహణ కూడా సులభమని పేర్కొంటున్నది.