Bill Gates | వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తి మొత్తాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరుకోవడం లేదు. ‘ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షమని’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, సంపన్న కుటుంబాలు తమ వారసత్వం గురించి తీసుకునే నిర్ణయాలు వారి సొంత విలువలపై ఆధారపడి ఉంటాయన్నారు. తాను తన పిల్లలను బాగా పెంచానని, మంచి విద్యను అందించానని, అయితే ఆస్తిని మాత్రం తన మొత్తం సంపదలో 1 శాతం కన్నా తక్కువే ఇస్తానని చెప్పారు.
ఇది వంశపారంపర్యం కాదన్నారు. మైక్రోసాఫ్ట్‌ను నడపాలని తాను వారిని కోరడం లేదని చెప్పారు. వారు సొంతంగా సంపాదించుకుని, విజయం సాధించే అవకాశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నానని తెలిపారు. బిల్ గేట్స్ మాజీ భార్య మెలిందాతో ఆయనకు ముగ్గురు పిల్లలు రోరీ గేట్స్, జెనిఫర్ గేట్స్ నస్సర్, ఫోబే గేట్స్ ఉన్నారు. ఆయన ఆస్తి విలువ 155 బిలియన్ డాలర్లు. దీనిలో ఒక శాతం అంటే, 1.55 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13,294 కోట్లు). ఈ ముగ్గురు పిల్లలకు ఈ ఆస్తిని ఇచ్చినట్లయితే, ప్రపంచంలోని ఒక శాతం సంపన్నుల్లో వారు కూడా ఉంటారు.