(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ రక్కసి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతున్నది. ఇటీవల న్యూమెక్సికో వర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించగా.. తాజాగా చైనా పరిశోధకులు వీర్యకణాల్లోనూ ఈ ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు తేల్చారు. చైనాకు చెందిన ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్రకణాలను ప్రయోగశాలలో విశ్లేషించగా, అన్ని నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు గుర్తించారు. ఈ వివరాలు ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్’లో జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, బ్యాగుల తయారీలో వాడే పాలీఇథైలిన్ (పీఈ), పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ), పాలీైస్టెరీన్ వంటి రేణువులను వీర్యంలో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. సంతానోత్పత్తికి కీలకమైన శుక్ర కణాల కదలికలను ప్లాస్టిక్ రేణువులు అడ్డుకొంటున్నాయని, శుక్ర కణాల ఎదుగుదల, నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలోనూ పురుషుల శుక్ర కణాల్లో మైక్రోప్లాస్టిక్ను గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు.