Austin Wells : కరోనా తర్వాత కూడా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అంతేకాదు ఎక్కడి నుంచి అయినా పని చేయొచ్చని చెప్పాయి. మెటా కంపెనీ కూడా తమ ఉద్యోగులకు రిమోట్ వర్కింగ్ ఆప్షన్ ఇచ్చింది. దాంతో అమెరికాకు చెందిన ఆస్టిన్ వెల్స్ అనే ఉద్యోగి వెరైటీగా ఆలోచించాడు. సాన్ డీగోలో నివసిస్తున్న ఇతను ప్రపంచం మొత్తం చుట్టేస్తూ వర్క్ చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా క్రూయిజ్ షిప్లో ఒక అపార్ట్‌మెంట్‌ను ఏడాది కాలానికి లీజుకు తీసుకున్నాడు. అందుకుగానూ ఆస్టిన్ మూడు లక్షల డాలర్లు ( రూ.2.4 కోట్లు) ఖర్చు పెట్టాడు. ‘నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే నేను ప్రతి రోజు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాను. నాతో పాటు నా జిమ్, డాక్టర్లు, డెంటిస్టలు కూడా ప్రపంచాన్ని చుట్టేయనున్నారు’ అంటూ ఆస్టిన్ తెలిపాడు.
ఎంవీ న్యరేటివ్ (MV Narrative) అనే క్రూయిజ్ షిప్లో ఆస్టిన్ 237 చదరపు అడుగుల గది లీజుకు తీసుకున్నాడు. అందులో ఫోల్డింగ్ బెడ్, షవర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ షిప్లో 500 ప్రైవేట్ రూమ్‌లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే.. ఈ భారీ షిప్ సముద్ర యాత్ర 2025లో మొదలవనుంది.