వాషింగ్టన్, ఆగస్టు 3: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఆధిపత్యం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ‘మెటా’ సంస్థ.. తాజాగా మ్యాట్ డీట్కే (24) అనే ఏఐ పరిశోధకుడికి ఏకంగా 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,180 కోట్ల) ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇటీవల వాషింగ్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ ప్రోగ్రామ్ నుంచి వైదొలిగిన డీట్కేని నాలుగేండ్లపాటు ‘మెటా’లో చేర్చుకునేందుకు తొలుత ఆ సంస్థ 125 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. కానీ, ఆ ఆఫర్‌ను డీట్కే తిరస్కరించారు. దీంతో ‘మెటా’ అధిపతి మార్క్ జుకర్‌బెర్గ్ వ్యక్తిగతంగా డీట్కేని కలిసి ఆ ప్యాకేజీని 250 మిలియన్ డాలర్లకు రెట్టింపు చేశారు.
విద్యారంగం నుంచి నిష్క్రమించిన తర్వాత డీట్కే సీటెల్‌లోని అలెన్ ఏఐ ఇన్స్టిట్యూట్లో పనిచేయడంతోపాటు అక్కడ ‘మోల్మో’ అనే చాట్‌బాట్ రూపకల్పనకు నాయకత్వం వహించారు. కేవలం టెక్స్‌ను మాత్రమే కాకుండా చిత్రాలను, ఆడియోను కూడా అర్థం చేసుకోగలగడం ఈ చాట్‌బాట్ ప్రత్యేకత. ‘న్యూర్ ఐపీఎస్-2022’లో ఔట్‌స్టాండింగ్ పేపర్ అవార్డును అందుకున్న తర్వాత డీట్కేకి పరిశోధక వర్గంలో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఆయన 2023 చివర్లో కొందరు భాగస్వాములతో కలిసి ‘వెర్సెప్ట్’ అనే అంకుర సంస్థను స్థాపించారు. స్వతంత్రంగా ఆన్లైన్లో నావిగేట్ చేయడంతోపాటు వివిధ పనులను చేయగలిగే అటానమస్ ఏఐ ఏజెంట్లపై ఈ స్టార్టప్ దృష్టి సారించింది. కేవలం 10 మంది బలగాన్ని మాత్రమే కలిగివున్న ఈ కంపెనీ ‘గూగుల్’ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ సహా పలువురు ఇతర పెట్టుబడిదారుల నుంచి 16.5 మిలియన్ డాలర్ల నిధులను పొందగలిగింది.