Evin Prison Fire | ఇరాన్‌లోని ఓ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. టెహ్రాన్‌లోని ఈవిన్ జైలులోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొన్నది. జైలులోని గార్డులు, కొందరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం మంటలు చెలరేగినట్లుగా తెలుస్తున్నది. అగ్నిప్రమాదం సమయంలో కాల్పుల శబ్ధం కూడా వినిపించినట్లుగా స్థానికులు చెప్తున్నారు.
అగ్నిప్రమాదం తర్వాత పలువురు నిరసనకారులు ఈవిన్ జైలు వైపు వెళ్లడం ఇరాన్ మానవ హక్కుల సంఘాలు విడుదల చేసిన వీడియోల్లో కనిపిస్తున్నది. ఇరాన్ భద్రతా దళాలు, అల్లర్ల నిరోధక దళాలు కూడా జైలు సమీపంలో భారీగా మోహరించారు. ఈ జైలులో రాజకీయ ఖైదీలు ఎక్కువగా ఉన్నారు. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న పలువురు వ్యక్తులను కూడా ఇదే జైలులో ఉంచారు. ఈ జైలులో ఉన్నవారిపై ఆకృత్యాలు పెరిగిపోవడంతో అమెరికా ఈ జైలును బ్లాక్ లిస్టులో పెట్టింది.
22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమిని పోలీసుల చేతిలో హత్యకు గురైన అనంతరం ఇరాన్లో నిరసనలు జోరందుకున్నాయి. ఇదే సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలోని జైలులో అగ్రిప్రమాదం ఘటన చోటుచేసుకోవడం విశేషం. గత నెల రోజులుగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా ఆందోళనకారులు మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిప్రమాదం తర్వాత జైలులో ఉన్నవారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.