బెర్లిన్ : జర్మనీలోని ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖజానాకు దొంగలు కన్నం వేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. చోరులు సుమారు రూ.315 కోట్ల (35 మిలియన్ డాలర్లు) విలువైన నగదు, బంగారం, ఆభరణాలు అపహరించినట్టు మంగళవారం పోలీసులు తెలిపారు. గెల్సెన్కిర్చేన్ నగరంలోని స్పార్కాస్ బ్రాంచ్‌లో జరిగిన ఈ దోపిడీలో దొంగలు మూడు వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను బద్దలు కొట్టారు.
నిందితులు పక్కనే ఉన్న గ్యారేజ్ నుంచి కన్నం వేసి నగదున్న వాల్ట్‌లోకి ప్రవేశించారు. వీకెండ్ కారణంగా శనివారం రాత్రే బ్యాంక్‌లోకి ప్రవేశించి అందులోని బాక్స్‌లను తాపీగా బద్దలు కొట్టి ఉంటారని భావిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున అలారం మోగడంతో అప్రమత్తమైన పోలీసులు బ్యాంకుకు చేరుకునే సరికి పెద్ద కన్నంతో ఉన్న వాల్ట్ వారిని వెక్కిరించడంతో హతాశులయ్యారు.