JD Vans : అంతర్జాతీయ వేదికపై అమెరికా (USA), బ్రిటన్ (Britain) దేశాల మధ్య ఊహించని విధంగా తీవ్ర దౌత్యపరమైన, రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బ్రిటన్‌లో శ్వేతజాతీయుడైన ఓ విద్యార్థి హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా ఉపాధ్యక్షుడు (US vice president) జేడీ వాన్స్ (JD Vans) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. యూరప్ దేశాల్లోకి అడ్డగోలుగా వస్తున్న భారీ వలసలవల్లే అక్కడి నాగరికత క్షీణిస్తోందని, ఇదొక ‘వలసదారుల దండయాత్ర’ అని వాన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే శ్వేతజాతీయుడైన విద్యార్థిపై భారత సంతతికి చెందిన విక్రమ్ దిగ్వా అనే సిక్కు యువకుడు కత్తితో దాడిచేశాడు. దారుణంగా పొడిచి హత్య చేశాడు. అయితే నిందితుడు విక్రమ్ తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు అబద్ధం చెప్పాడు. దాంతో తీవ్ర గాయాలతో పడి ఉన్న హెన్రీ నోవాక్ను పోలీసులు చనిపోయే ముందు బేడీలు వేసి ఉంచారు. ఈ ఘటన బ్రిటన్‌లో తీవ్ర హింసాత్మక అల్లర్లకు దారితీయడమే కాకుండా, అంతర్జాతీయంగా రైట్ వింగ్ నేతల ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఉదంతంపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. ‘ఒక నాగరికత ఎలా అంతరిస్తుందో హెన్రీ నోవాక్ కూడా అలాగే చనిపోయాడు. అధికారులు అతడిని పట్టించుకోకుండా, చేయని ద్వేషపూరిత నేరాలకు బాధ్యుడిని చేస్తూ బేడీలు వేశారు’ అని వ్యాఖ్యానించారు. గత కొన్ని తరాలుగా ఐరోపా పాలకులు తీసుకుంటున్న ఆత్మద్రోహ నిర్ణయాలు, పశ్చిమదేశాలను ద్వేషించే వలసదారుల దండయాత్రవల్లే ఈ పరిస్థితి వచ్చిందని, పాలకుల వైఖరిపై ప్రజల్లో ‘న్యాయబద్ధమైన ఆగ్రహం’ రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జేడీ వాన్స్‌కు అత్యంత ఆప్తమిత్రుడైన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ఘటనపై, బ్రిటన్ పోలీసుల తీరుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు గురువారం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కూడా బ్రిటన్‌లోని పోలీస్ వ్యవస్థను తప్పుబడుతూ నివేదిక ఇవ్వడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు నేరుగా తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.
‘మా ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకునేందుకు, మా వీధుల్లో విభజనలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం మండిపడింది. ఎలాన్ మస్క్ కూడా బ్రిటన్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని స్టార్మర్ నేరుగా ఆరోపించారు. ఈ దారుణ హత్యను దేశంలో ద్వేషాన్ని, ఉద్రిక్తతలను పెంచడానికి వాడుకోవద్దని మృతుడు హెన్రీ నోవాక్ కుటుంబసభ్యులు కోరినట్లు బ్రిటన్ ప్రభుత్వం స్పష్టంచేసింది.