వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులను రప్పించడానికి ఉద్దేశించిన హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశంలోనే చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం ఆయనకు సంయుక్తంగా విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం భారత్‌తో అమెరికా సంబంధాలను దెబ్బ తీస్తుందని, అంతేకాక, టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యం బలహీనమవుతుందని హెచ్చరించింది.
ప్రతినిధులు జిమ్మీ పనెట్టాతో పాటు కాంగ్రెస్ సభ్యులు అమి బెరా, సలుడ్ కర్బాజల్, జూలీ జాన్సన్ తదితరులు ట్రంప్‌కు ఈ మేరకు లేఖ రాశారు. సెప్టెంబర్ 19న ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం ఆమెరికా ఆవిష్కరణలకు, భారత్‌తో వ్యూహాత్మక బంధానికి హాని కలిగిస్తుందని వారు చెప్పారు. హెచ్-1బీ వీసాల్లో 71 శాతం భారత్‌కే కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ప్రతిభను ఆకర్షించడం వల్ల ఇండో పసిఫిక్‌లో కీలక ప్రజాస్వామ్య భాగస్వామితో మన వ్మూహాత్మక బంధం కూడా బలపడుతుందని వారు తెలిపారు.