Heart breaking | సింగపూర్‌లో ఓ వ్యక్తి తాను ఇష్టపడిన అమ్మాయిపై దావా వేశాడు. తన గుండె పగిలిపోయేలా ప్రవర్తించిందంటూ జరిమానా చెల్లించాలని సింగపూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జరిగిన ఈ అవమానానికి రూ.25 కోట్లు చెల్లించేలా ఆ అమ్మాయిని ఆదేశించాలని ఆ యువకుడు కోర్టను అభ్యర్థించాడు. వివరాల్లోకెళితే..
సింగపూర్‌కు చెందిన కోషిగన్ అనే వ్యక్తి నోరా టాన్ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే, కోషిగన్ ప్రేమను నోరా టాన్ తిరస్కరించింది. కేవలం అతడితో స్నేహం మాత్రమే చేశానని చెప్పింది. ఆ అమ్మాయి తనను కేవలం స్నేహితుడిగానే పరిగణిస్తున్నదని తెలియగానే తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి సింగపూర్ హైకోర్టులో జరిమానా పిటిషన్ వేశాడు. స్ట్రెయిట్ టైమ్స్ ప్రకారం, వీరిద్దరు 2016 లో తొలిసారి కలుసుకున్నారు. మంచి స్నేహితులయ్యారు. క్రమంగా కోషిగన్కు అమ్మాయిపై లవ్ ఫీలింగ్స్ కలగడం మొదలయ్యాయి. అయితే అమ్మాయి మాత్రం కేవలం స్నేహంగానే భావిస్తూ వచ్చింది. 2020 సెప్టెంబర్‌లో ఇదే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
తుదకు ఇద్దరి మధ్య స్నేహితాన్ని ముగించేందుకు నోరా టాన్ నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో కోషిగన్ ఆమెపై రెండు కేసులు పెట్టాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా తనను మానసికంగా వేధింపులకు గురిచేసినందున 3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 25 కోట్లు) చెల్లించాలని హైకోర్టులో దావా వేశాడు. అలాగే, తనతో సంబంధాన్ని కొనసాగించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు 22 వేల డాలర్లు (దాదాపు రూ.18 లక్షలు) చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ రెండో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ల విచారణ ఈ నెల 9 న సింగపూర్ హైకోర్టు విచారించనున్నది.