శాన్ఫ్రాన్సిస్కో, జూలై 27: డ్రీమ్ జాబ్ సాధించాలని అనేక మందికి గట్టి పట్టుదల ఉంటుంది. అందుకు తగిన కృషి, ప్రయత్నాలు చేస్తారు. పదేపదే తిరస్కరణకు గురౌతున్నా.. ప్రయత్నించడం ఆపరు. అయితే ఈ క్రమంలో నాలుగైదు సార్లు ప్రయత్నించి.. విజయం సాధించలేకపోతే పక్కకు తప్పుకునే వారు కూడా ఉంటారు. అయితే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన టైలర్ కొహెన్ అనే వ్యక్తి తన కలల ఉద్యోగం సాధించే విషయంలో 39 సార్లు విఫలమైనా పట్టువిడువలేదు. దిగ్గజ సంస్థ గూగుల్ ఉద్యోగం సాధించాలన్న తన కలను 40వ ప్రయత్నంలో ఎట్టకేలకు సాధించాడు. టైలర్ కొహెన్ ఇతర ఉద్యోగాలు చేసుకుంటూనే 2019 నుంచి గూగుల్‌కు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. ‘పట్టుదలకు, పిచ్చితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండింటిలో నాకున్నది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో 39 తిరస్కరణలు.. ఎట్టకేలకు ఒక ఆమోదం’ అంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గూగుల్‌తో జరిపిన సంభాషణల స్క్రీన్‌షాట్‌ను కొహెన్ షేర్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.