ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ విషయం తెలిసినా కొందరు ఆకతాయి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో జరిగిన ఘటన కూడా అలాంటిదే.
తమాషాకు తలపై టపాసులు పేల్చుకున్నాడా వ్యక్తి. దాంతో తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో వెలుగు చూసింది. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు.
దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాబ్లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదకర ఫీట్ చేసే సమయంలో పాబ్లో ఫుల్లుగా మందుకొట్టి ఉన్నాడని, ఆ మత్తులోనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని స్నేహితుడు వెల్లడించాడు.