Maldives : వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురైంది. అవినీతి, మనీలాండరింగ్ కేసులో క్రిమినల్ కోర్టు ఆదివారం ఆయనను దోషిగా తేల్చింది. త్వరలోనే అబ్దుల్లాకు జైలు శిక్షను విధిస్తామని కోర్టు తెలిపింది. అయితే.. అబ్దుల్లా మాత్రం తాను ఏ తప్పు చేయలేదని తెలిపాడు. 2018లో అబ్దుల్లా అధ్యక్ష పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి చెందిన 10 లక్షల డాలర్లను దుర్వినియోగం చేశారని అబ్దుల్లా మీద అభియోగాలు నమోదయ్యాయి. దాంతో విచారణ చేపట్టిన కోర్టు 2019లో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల డాలర్ల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను 2020లో గృహ నిర్బంధం చేశారు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలలకే అబ్దుల్లా బయటకు వచ్చారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అబ్దుల్లా మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలు పెట్టారు. మాల్దీవుల వ్యవహారాల్లో భారత్ జోక్యాన్ని నిరసిస్తూ క్యాంపెయిన్ కూడా నడిపారు. అంతేకాదు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయనను ప్రొగ్రెస్సివ్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించింది.