కౌలాలంపూర్: మలేషియాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రి యాకూబ్ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రత్యేక ప్రసంగం చేసిన ప్రధాని.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నానని చెప్పారు. అదేవిధంగా 60 రోజుల్లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
అధికార యునైటెడ్ మలేయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (UMNO) అధ్యక్షుడు జాహిద్ హమిడి ఈ ఏడాది ప్రారంభం నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా దేశంలో సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు జరగాలని అంటున్నారు. దాంతో పార్టీలోని జాహిద్ మద్దతుదారులంతా పార్లమెంట్‌ను రద్దు చేయాలని ప్రధాని ఇస్మాయిల్ సబ్రిపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని ఇస్మాయిల్ సబ్రి ఇవాళ పార్లమెంట్‌ను రద్దు చేశారు. UMNO అనేది మలేషియాలోని ఒక రాజకీయ పార్టీ. ప్రస్తుతం మలేషియా సంకీర్ణ సర్కారులో UMNO అతిపెద్ద పార్టీగా ఉన్నది. అయితే తాజా రాజకీయ పరిణామాలపై మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా అహ్మద్ షా అసంతృప్తి వ్యక్తం చేశారని రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది.