Emmanuel Macron : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి కావాలంటే ఆయన గాజాలో యుద్ధం ఆపాలని సలహా ఇచ్చారు.
ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం అమెరికాకు వచ్చిన మాక్రాన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘నాకు శాంతి కావాలి. నేను అనేక యుద్ధాలు ఆపాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరాస సమావేశంలో చెప్పిన విషయాన్ని మాక్రాన్ ప్రస్తావించారు. యుద్ధం ఆపిన వారికే నోబెల్ శాంతి బహుమతి వస్తుందని, అయితే గాజాలో ఇంకా మారణహోమం ముగియలేదని వ్యాఖ్యానించారు.
యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే శక్తి అమెరికాకు మాత్రమే ఉందని, ట్రంప్ మాత్రమే ఆ పని చేయగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ గాజా యుద్ధాన్ని ముగించడంలో విజయం సాధిస్తేనే ఆయనను నోబెల్ బహుమతి వరిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికాపై పలు విమర్శలు చేశారు. గాజాలో మారణహోమానికి తాము ఎలాంటి ఆయుధాలు పంపడం లేదని, అమెరికానే ఇజ్రాయెల్‌కు ఆ సాయం చేస్తోందని ఆరోపించారు.
పాలస్తీనా ప్రత్యేక దేశంగా మారడమనేది ఇజ్రాయెల్ పైనే ఆధారపడి ఉంటుందని మాక్రాన్ అన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌తో సహా పలు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. ఈ క్రమంలో తమ చర్యకు ఇజ్రాయెల్ నుంచి ప్రతీకార చర్య కచ్చితంగా ఉంటుందని మాక్రాన్ అన్నారు. వాటన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని, యుద్ధం ముగించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.