న్యూయార్క్: పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా కల్పించడానికి తాము అధికారికంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు న్యూయార్క్‌లో సోమవారం చేదు అనుభవం ఎదురైంది. అగ్రరాజ్యంలో ఆయన తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఐరాస కార్యాలయం నుంచి ఫ్రెంచ్ ఎంబసీకి కాలినడకన వెళ్తున్న ఆయనను న్యూయార్క్ పోలీసులు నడివీధిలో నిలిపివేశారు.
తమ అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ కోసం అతడిని ఆపినట్టు పోలీసులు తెలిపారని ఫ్రెంచ్ మీడియా న్యూస్.ఏజెడ్ తెలిపింది. ‘క్షమించండి ప్రెసిడెంట్.. ఇప్పుడు అన్ని దారులను మూసివేశాం’ అని ఒక పోలీస్ అధికారి అన్న సంభాషణ వీడియో వైరల్ అవుతున్నది. ఈ అసాధారణ పరిస్థితిపై మాక్రాన్ ట్రంప్‌కు ఫోన్ చేసి మరీ చెప్పి, సమస్యను పరిష్కరించాలని కోరారు.
‘ఏంటో ఊహించు.. నేను న్యూయార్క్ వీధిలో వేచి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నీ కోసం ప్రతి వాహనాన్ని నిలిపివేశారు.’ అని ఆయన ఫోన్లో జోక్ చేశారు. తాను కూడా ఫ్రెంచ్ ఎంబసీకే వెళ్తున్నట్టు ట్రంప్ తెలిపారు. తర్వాత చాలాసేపటికి ఆ వీధిలో పాదచారులను అనుమతించారు. దాంతో మాక్రాన్ అప్పటివరకు నిలబడే ట్రంప్‌తో ఫోన్లో సంభాషిస్తూనే ఉన్నారు.