జోహన్నస్బర్గ్: ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం పదేళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ ఈ స్థాయిలో సగటు జీవితకాలం పెరగలేదని డబ్ల్యూహెచ్వో చెప్పింది. కానీ తాజాగా కోవిడ్ వల్ల జీవితకాలంపై ప్రభావం పడి ఉంటుందని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్ ఇన్ ఆఫ్రికా రీజన్ 2020 పేరుతో డబ్ల్యూహెచ్వో ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఆఫ్రికాలో ఆరోగ్యకరమైన వ్యక్తి సగటు జీవితకాలం 2000 సంవత్సరంలో 46 ఏళ్లు కాగా, ఆ జీవితకాలం 2019లో 56కి పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలో సగటు జీవితకాలం 64 కన్నా తక్కువగానే ఉంది. ఆరోగ్య సేవలు మెరుగుపడడం, శిశు సంరక్షణ, వ్యాధుల నిర్మూలన వల్ల ఆఫ్రికాలో సగటు జీవితకాలం పెరిగినట్లు తెలుస్తోంది. హెచ్ఐవీ, టీబీ, మలేరియా లాంటి వ్యాధుల్ని కంట్రోల్ చేయడం కూడా ఓ కారణమని చెబుతున్నారు.