Canada PM | ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంటు స్థానంలో ఓటమి ఎదురైంది. ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థానంలో ఓటమి చవిచూసింది.
సోమవారం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోయారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలీవ్రా డిమాండ్ చేశారు.