బ్యాంకాక్, జనవరి 23: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయ దేశాలలో థాయ్‌లాండ్ మొదటిది కాగా, ఆసియాలో మూడోది. అంతకుముందు తైవాన్, నేపాల్ దేశాలు దీనిని చట్టబద్ధం చేశాయి. ఎల్జీడీటీక్యూ ప్లస్ విభాగంలో ఉన్న వారు స్వలింగ వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఆ దేశం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో గురువారం స్వలింగ జంటలు తమ భాగస్వామితో దిగిన ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లతో సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. సెంట్రల్ బ్యాంకాక్‌లోని ఒక షాపింగ్ మాల్లో వందలాది జంటలు పాల్గొని దశాబ్దాల నాటి తమ పోరాటం ఇన్నాళ్లకు ఫలించిందని సంతోషం వ్యక్తం చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ కొత్త చట్టాన్ని థాయ్‌లాండ్ రాజు వజీరాలాంగ్కోర్న్ సెప్టెంబర్‌లో ఆమోదించగా, 120 రోజుల తర్వాత గురువారం నుంచి అమలులోకి వచ్చింది.